Wednesday, October 3, 2007

నా రహస్య ఎజెండా

ఈమధ్య ఏ టీవి ఛానెల్ పెట్టినా ఏదో ఒక రకమైన పాటల పోటీలు.పాడుతా తీయగా,పాడాలని ఉంది,నువ్వు వద్దన్నా నేను పాడుతా..ఇలాంటివన్నమాట.ఈ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడేవాళ్ళని చూస్తే ముచ్చటేస్తుంది.అంతలోనే ఒక విషాదం నన్ను అల్లుకుంటుంది.ఈ సమాజం నాలో ఉన్న ఒక గాయనిని ఎదగనివ్వలేదు.అందుకే నాకు ఈ సమాజం అంటే ఏవగింపు కలిగింది.అసలు నేను కూడ నక్సలైట్లలో కలసిపోదామనుకున్నాను, కాని అది మన ఒంటికి సరిపోయే వ్యవహారం కాదని ఆ ఆలోచనని విరమించుకున్నాను.నేను ఎందుకు ఇంత భాదపడుతున్నానో తెలియాలంటే మాత్రం గుండ్రం గుండ్రంగా తిరిగి ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళాల్సిందే.

నాకు చిన్నప్పట్నుంచి మంచి సింగర్ అనిపించుకోవాలనే ఉబలాటం చాలా ఎక్కువ.ఒకసారి ఏదో పుస్తకంలో చదివాను,ఒక మనిషి మనసుని చేరుకోవాటనికి సులువైన రెండు మార్గాలు,ఒకటి మంచి భోజనం చేసి పెట్టడం.రెండు,వాళ్ళు అలసట మర్చిపోయేలా చక్కగా పాట పాడి వినిపించడం.మొదటిది ఎలాగు మనకి చేతకాదు కాబట్టి,బాగా పాటలు పాడి అందర్ని పడగొట్టేయాలన్నది నా ప్లాన్ అన్నమాట.అనుకున్నదే తడవుగా దూరదర్శన్లో ప్రతిరోజు వచ్చే లలిత సంగీత కార్యక్రమాలన్ని జాగ్రత్తగా ఒక్కటి కూడ మిస్సవ్వకుండ చూసేదాన్ని.అప్పట్లో నాకొక గొప్ప సందేహమొచ్చింది.కొన్ని పాటల్ని ఏమో లలిత గీతాలు అనేవారు.ఇంకొన్నింటిని యుగళగీతాలు అనేవాళ్ళు.మా అమ్మనడిగితే లలిత సంగీతం అంటే ఒక్కరే పాడుతారు,యుగళగీతాలంటే Duet అని చెప్పింది.కాని నాకిప్పటికి డౌటే! ఈ క్లాసిఫికేషన్ నాకు ఎప్పుడు అర్దమవుతుందో ఏమో? ఏది ఏమైనా,కొన్ని రోజుల ప్రాక్టిస్ తరవాత మా ఇంట్లో ఉన్న డొక్కు టేప్ రికార్డర్ లో మా అమ్మ నా పాట రికార్డ్ చేసింది.(నా గొడవ భరించలేక రికార్డ్ చేసారు అని చదువుకోగలరు) నేను చాలా ఉత్సాహంగా "మిలే సుర్ మేరే తుమ్హారా.." పాడి 'నా పాట హిట్టు' అని అనుకుంటు రీ-ప్లే బటన్ నొక్కాను."కె..వ్..వ్..వ్..వ్" ఇది నా గొంతు కాదు!! ఈ రికార్డింగ్ ఏమో కాని,ఇంట్లో మన ఇమేజికి ఘోరమైన డామేజి జరిగింది.ఆ తరవాత ఇప్పటివరకు నేను ఎప్పుడు నా వాయిస్ ని రికార్డు చెయ్యలేదు.

స్కూల్ లో మేము ముగ్గురం ఫ్రెండ్స్ ఉండేవాళ్ళం.క్లాస్ లో మొదటి మూడు ర్యాంకులు మా ముగ్గురివే. సుజాత,సునీత,నేను అన్నింట్లో ఒకరికొకరం గట్టి పోటి.కాకపోతే వాళ్ళిద్దరు పాటలు కూడ చాలా బాగా పాడతారు. శాస్త్రీయ సంగీతం నేర్చుకోకపోయినా,ఏపాటనైనా సరే రెండుసార్లు వింటే చాలు పాడేసేవాళ్ళు. మేము ఎప్పుడు కలిసే ఉండటం వల్ల స్కూల్ లో టీచర్లందరు నేను కూడ పాడతానని అనుకునేవాళ్ళు. మాకు స్కూల్ లో రోజు ఉదయం ప్రార్ధనలో పాటలు పాడటానికి నాలుగు టీమ్స్ చేసారు. ఆ రోజు పాటలు పాడాల్సిన తొమ్మిదో తరగతి అక్కయ్యలు రాకపోతే,మా P.E.T సార్ మైక్ లో సుజాత,సునీత,క్రాంతి రావాలి అని పిలిచారు. నాకు రెండు లైన్ల అవతల నిల్చున్న మా అక్క షాక్ కొట్టినట్టు,నన్ను చూసి "కొంపదీసి నువ్వు పాడతావా ఏంటి" అని అడిగింది.నా మనసు మళ్ళీ అతుక్కోవడానికి వీలు లేకుండా చిన్న చిన్న ముక్కలైపోయింది.

ఇన్ని అవమానాలు,అగచాట్ల మధ్య ఒక సుముహూర్తాన నేను ఇంజనీరింగ్ లో జాయిన్ అయ్యాను. ఆ రోజే మొదటిరోజు.కాలేజిలోనే హాస్టల్ ఉంది.అందరి అమ్మానాన్నలు వచ్చి పిల్లలందర్ని దిగబెట్టి కొట్టుకోవద్దని జాగ్రత్తలు చెప్పి సాయంత్రం ఐదింటికల్లా వెళ్ళిపోయారు. ఒక గంట తరవాత అమ్మాయిలందరం హాస్టల్ మెట్ల మీద కూర్చున్నాం.అందరం ఒకర్ని ఒకరు పరిచయం చేసుకుంటున్నాం.ఇంతలో కార్తీక లక్ష్మి అనే అమ్మాయి నాపేరు అడిగింది.నేను పేరు చెప్పాను.వెంటనే "హే,నీ వాయిస్ చాలా టిపికల్ గా ఉంది" అని అంది. 'Not again!!' అని అనుకొని,టిపికల్ అంటే బాగుందనా,బాగాలేదనా అని అడిగాను.అర్ధంకాని నవ్వొకటి నవ్వింది.టిపికల్ అంటే టిపికల్, బాగుంది బాగాలేదు అని కాదు అంది."an electron is missing in your outer most orbit" అని చెప్పింది. 'వార్ని..దెబ్బకొట్టిందిరా' అని అనుకొని నోరు మూసుకున్నాను. తరవాత రోజు క్యాంపస్ లో సీనియర్స్ చాలా మందిని పాట పాడమని అడిగారంట.నన్ను ఒక్క వెధవ కూడ పాట పాడమని అడగలేదు.అసలు వీళ్ళేమి సీనియర్స్? ఇదేం ర్యాగింగ్ అని భాదపడ్డాను. ఇంటర్లో ఉన్నప్పుడు ర్యాగింగ్ గురించి కథలు కథలుగా చెప్పుకునేవాళ్ళం.ఇక్కడికొచ్చి చూస్తే ర్యాగింగ్ లేదు నా మొహం లేదు.

ఇంజనీరింగ్ అయిపోయాక అదృష్టం నన్ను ఎడమకాలుతో తన్నింది.ఆ దెబ్బకి నేను వైజాగ్ నేవి సర్వీసెస్ సెంటర్ లో వచ్చి పడ్డాను.అక్కడ దగ్గర దగ్గర ఒక యేడాది పాటు ఉద్యోగం వెలగపెట్టాను.నేను అద్దెకుండే ఇంటి ఓనర్ ప్రతి గురువారం సాయిబాబ భజన అంటూ భీభత్సమైన గొంతేసుకొని మైకులో పాడి చావదొబ్బేవాడు. ఇంక మా టీమ్ లో సుభాష్ అని ఒక బీహారీ ఉండేవాడు.అమ్మో,వీడు చాలా డేంజర్ మనిషి.పాటలు చాలా బాగా పాడతానని సొంత డబ్బా కొట్టుకొనేవాడు. ఒకరోజు "కిశోర్ కుమార్ వాయిస్ నా వాయిస్ లాగ ఉంటుంది" అని చెప్పాడు.నేను డంగైపోయాను. "నీ వాయిస్ కిశోర్ కుమార్ వాయిస్ లాగా ఉంటుందా లేక కిశోర్ కుమార్ వాయిసే నీ వాయిస్ లాగా ఉంటుందా" అని అడిగాను. మళ్ళీ అదే కూత కూసాడు. ఇక వీడితో మాట్లాడటం అనవసరం అని అనుకున్నాను. ఒకరోజు ఆఫీస్ అయిపోయాక నేను చాలా హుషారుగా ఏదో పాట పాడుతూ మెట్లు దిగుతున్నాను.నా పక్కనుండి వెళ్తున్న మా టీమ్ లీడర్ శ్యామ్ తూలి పడిపోయినట్టు యాక్షన్ చేసి "అమ్మో,నువ్వు ఇంక ఎప్పుడు పాటలు పాడకు" అని చెప్పాడు.

కాని బాగా ఆలోచించినప్పుడు నాకనిపిస్తుంది,కడుపులో కెలికేసినట్టు పాడే రమణ గోగుల, చక్రి, R.P.పట్నాయక్ వీళ్ళందరికన్నా నేను బాగానే పాడతాను అని. ఈమధ్య Zoom TV లో చూపించారు,జూహి చావ్లా శాస్త్రీయ సంగీతం నేర్చుకొని తన మొదటి ప్రదర్శన ఇచ్చింది.ఇది చూడగానే నాకు బుర్రలో బల్బు వెలిగింది. మనం కూడ ఇంకో రెండు మూడేళ్ళు ఉద్యోగం చేసి డబ్బు పోగుచేసి ఫుల్ టైమ్ సంగీతం నేర్చుకొని ప్రదర్శన ఇవ్వాలని డిసైడ్ చేసేసుకున్నాను. అప్పుడప్పుడు నాకు ఒక కలొస్తుంది.నా మొదటి ప్రదర్శనకే Standing Ovation సంపాదించేసినట్టు.ఏదో ఒక రోజు నా కల నిజమవుతుంది.ఇన్ని రోజులు నా పాటని,నన్ను చూసి నవ్విన వాళ్ళంతా నా ఆటోగ్రాఫ్ కోసం ఎగబడతారు అప్పుడు.ఇది సత్యం,తథ్యం,నిత్యం.ఇదే నా రహస్య ఎజెండా.కొంచెం ఎక్కువయ్యిందా??